🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

ఆహార తయారీ కేంద్రాలపై అధికారుల కొరడా!

Main Image Additional Image Additional Image Additional Image Additional Image
నిత్యం నిఘా,వరంగల్ ట్రై సిటీ:

ఆహార తయారీ కేంద్రాలపై అధికారుల కొరడా!

9 కేంద్రాల లైసెన్సులు సస్పెండ్‌.. పలు యూనిట్లు మూసివేత

స్వీట్లలో ఫేషియల్‌ రోజ్‌వాటర్‌ వినియోగం.. చనిపోయిన దోమలతో చక్కెర పాకం

5,045 కిలోల అనుమానాస్పద ముడి సరుకులు స్వాధీనం

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధిలోని పలు ఆహార తయారీ కేంద్రాలపై తెలంగాణ ఆహార భద్రత విభాగం అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తీవ్రమైన అపరిశుభ్రత, నాణ్యతా లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. దీంతో తొమ్మిది తయారీ కేంద్రాల ఆహార భద్రత లైసెన్సులను సస్పెండ్‌ చేయడంతో పాటు, పలు యూనిట్ల కార్యకలాపాలను నిలిపివేశారు. నాలుగు షోకాజ్‌ నోటీసులు, ఒక మెరుగుదల నోటీసు జారీ చేశారు. కేంద్ర లైసెన్స్‌ పరిధిలోని మరో తయారీ కేంద్రం లైసెన్స్‌ సస్పెన్షన్‌కు సిఫార్సు చేశారు.

తెలంగాణ ఆహార భద్రత కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా సహాయ ఆహార నియంత్రణ అధికారి జ్యోతిర్మయి పర్యవేక్షణలో పది ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మిఠాయిలు, మసాలా దినుసులు, నూనెలు, అల్లం వెల్లుల్లి పేస్టు, సోంపు, ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రాలతో పాటు ఇతర ఆహార ఉత్పత్తుల యూనిట్లను అధికారులు తనిఖీ చేశారు.

స్వీట్లలో ముఖానికి రాసుకునే రోజ్‌వాటర్‌!

తనిఖీల్లో స్వీట్ల తయారీలో సువాసన కోసం ముఖానికి రాసుకునే ఫేషియల్‌ రోజ్‌వాటర్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చిప్స్‌ తయారీకి నిల్వ ఉంచిన బంగాళాదుంపలు కుళ్లిపోయి ఉండగా, అల్లానికి బూజు పట్టినట్లు గుర్తించారు. రూ.9,400 విలువైన గడువు ముగిసిన ఆహార పదార్థాలను గడువు ఉన్న ఇతర పదార్థాలతో కలిపి నిల్వ ఉంచినట్లు వెల్లడించారు.

ఒక సోంపు తయారీ కేంద్రంలో సరైన చిరునామా, అవసరమైన వివరాలు లేని లేబుళ్లతో అనుమానాస్పదంగా ఉన్న 5,045 కిలోల ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5,41,150గా అధికారులు పేర్కొన్నారు.

చక్కెర పాకంలో చనిపోయిన దోమలు.. అపరిశుభ్ర వాతావరణం

మిఠాయిల తయారీకి ఉపయోగించే చక్కెర పాకంలో చనిపోయిన దోమలు కనిపించినట్లు అధికారులు గుర్తించారు. తయారీ కేంద్రంలో కుక్కలు సంచరిస్తుండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం ఆహార భద్రతా ప్రమాణాలపై తీవ్ర నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.

ముడి పదార్థాలను విద్యుత్‌ నియంత్రణ ప్యానళ్ల లోపల నిల్వ ఉంచడం, విద్యుత్‌ బోర్డులు తెరిచి ఉండటం, అగ్నిమాపక పరికరాల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులను గుర్తించారు. నీటి నిల్వ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, తయారీ కేంద్రాల పక్కనే దుర్వాసన వెదజల్లే మురుగు కాలువలు ఉన్నట్లు తెలిపారు. వంటగది నేల జిడ్డుగా, జారిపోయే ప్రమాదంతో ఉండగా, నూనె నిల్వ ట్యాంకులు, నూనె నింపే ఇనుప డబ్బాలు, స్వీట్ల తయారీ యంత్రాలు తుప్పు పట్టి దుమ్ముతో నిండిపోయినట్లు గుర్తించారు.

ప్యాకేజింగ్‌ సామగ్రిపై బ్రాండ్‌ పేర్లను తప్పుగా ముద్రించినట్లు గుర్తించి, సుమారు 80 కిలోల తప్పుడు లేబుళ్ల సామగ్రిని ధ్వంసం చేశారు. ఆహార తయారీ సిబ్బందికి అవసరమైన ఆహార భద్రత శిక్షణ లేకపోవడం, వైద్య ధ్రువపత్రాలు, నీటి నాణ్యత పరీక్ష నివేదికలు, పురుగుల నియంత్రణ రికార్డులు అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను కూడా గుర్తించారు. సిబ్బంది కనీస రక్షణ దుస్తులు, చేతి తొడుగులు ధరించకపోవడాన్ని అధికారులు గమనించారు.

నమూనాలు ప్రయోగశాలకు.. ఉల్లంఘనలపై కఠిన చర్యలు

తనిఖీల్లో సేకరించిన అనుమానాస్పద ఆహార నమూనాలను నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన కేంద్రాలపై చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సహాయ ఆహార నియంత్రణ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి, మసాలా తయారీ కేంద్రాల నిర్వాహకులు చెల్లుబాటయ్యే ఆహార భద్రత లైసెన్సులను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ఆహార తయారీలో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ ప్రత్యేక తనిఖీల్లో వివిధ జిల్లాలకు చెందిన ఆహార భద్రత అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించేందుకు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
🏠 Home